టాప్ ట్రెండింగ్ కథనాలు

చదువుకో నక్క బావ…

అసలైన చదువు

ఒకప్పుడు అడవికి రాజైన సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులన్నీ సుఖశాంతులతో జీవించాలని ఆశపడింది. మంచి ఆలోచనలతో, మంచి నడవడికతో, పరస్పర సహకారంతో నిండిన ఆదర్శమైన అడవిని నిర్మించాలంటే పిల్లల నుంచే ప్రారంభం కావాలనుకుంది. అందుకే ఒక రోజు జంతువులన్నింటినీ సమావేశం పెట్టింది.

చదువు తెలివిని పెంచుతుంది. మంచి చెడ్డలను తెలియజేస్తుంది. మన పిల్లలకు తప్పనిసరిగా విద్యాబుద్ధులు నేర్పాలి అని సింహం ఆదేశించింది.

రేపటి నుండి జంతు పిల్లలందరినీ నా దగ్గరకు పంపండి. నేనే వారికి విద్యాబుద్ధులు నేర్పి యోగ్యులుగా తీర్చిదిద్దుతాను అని స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది నక్క.

నక్క ఆంతర్యం తెలిసిన చిన్న జంతువులు ఒక్కసారిగా దిగులుపడ్డాయి. పెద్ద జంతువులు మాత్రం ఒకరికొకరు చూసుకుని నవ్వుకున్నాయి. అది నక్కకు అవమానంగా అనిపించింది.

విద్యాబుద్ధులు ఏ గురువు దగ్గర నేర్పిస్తారు అని నక్క వ్యంగ్యంగా ప్రశ్నించింది.

మర్కట గురువు దగ్గరైతే మంచిది మృగరాజా అని పులి సూచించింది.

వెకిలి చేష్టలు నేర్చుకోవడానికా అని నక్క హేళనగా అడిగింది.

ఆ మాటలు విన్న కోతి బాధపడింది. సింహం మాత్రం ప్రశాంతంగా స్పందించింది. కోతిమిత్రుడు వ్యక్తిగతంగా మంచివాడు. మంచి చెడ్డలను బోధించగలడు. నీతి నేర్పగలడు. పిల్లలు రత్నాలుగా మారాలంటే అటువంటి గురువు అవసరం. అందుకే మర్కట మిత్రుడినే గురువుగా నియమించాలని నేను నిర్ణయిస్తున్నాను అని చెప్పింది.

నక్క వెంటనే తన వాదనను ముందుకు తెచ్చింది. మాంసాహార జంతువులకు వేట నేర్చుకోవడమే అసలైన చదువు. మంచి చెడ్డలు ఆలోచిస్తూ ఉంటే వేట ముందుకు సాగదు. ఈ విషయంలో భుజబలం ఉంటే చాలు అని చెప్పింది.

ఆ సమయంలో కుందేలు ముందుకు వచ్చి వినమ్రంగా మాట్లాడింది. ఆహార సంపాదన వ్యక్తిగత అవసరం. కానీ అందరి శ్రేయస్సుకు ఉపయోగపడేది బుద్ధిబలం. భుజబలం ఒక్కరి రక్షణకు సరిపోవచ్చు కానీ బుద్ధిబలం సమూహాన్ని కాపాడుతుంది. ఆదర్శమైన అడవి కావాలంటే పిల్లలకు బుద్ధిబలం అవసరం అని విన్నవించింది.

మిగతా జంతువులన్నీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. విద్యాబుద్ధులే పిల్లలకు అవసరం అని పట్టుబట్టాయి.

సింహం ఆలోచనలో పడింది.

అప్పుడే ఎలుగుబంటి పరుగెత్తుకుంటూ వచ్చి ఒక భయానక వార్త చెప్పింది. వేటగాళ్ల గుంపు ఆయుధాలతో అడవిలోకి ప్రవేశించింది అని తెలిపింది.

ఇప్పుడు వాళ్లను ఎదుర్కొనడానికి భుజబలం అవసరం అని నక్క తన వాదనను మళ్లీ బలపరిచింది. దృఢమైన జంతువులు దాడి చేస్తే వారిని తరిమేయొచ్చు అని చెప్పింది.

అప్పుడు కోతి ప్రశాంతంగా మాట్లాడింది. మీరు అందరూ నిశ్శబ్దంగా మీ మీ స్థావరాలకు వెళ్లండి. మీ రక్షణ నా బాధ్యత అని ధైర్యం చెప్పింది.

ఇది అసలైన పరీక్ష సమయం అని భావించిన సింహం సహా మిగతా జంతువులన్నీ వెంటనే దాక్కున్నాయి. నక్క మాత్రం అక్కడే ఉండి తన భుజబలం చూపించేందుకు సిద్ధమైంది.

కోతి సమీపంలోని ఒక పెద్ద చెట్టెక్కి బలంగా కొమ్మలను ఊపింది. చెట్టు చివర వేలాడుతున్న తేనెతుట్టె కదిలింది. వెంటనే కోతి మరో చెట్టుకు ఎగిరింది. అక్కడి నుండి ఇంకో చెట్టుకు దూకింది.

తేనెతుట్టె కదలడంతో తేనెటీగలు విపరీతంగా ఎగిరి వేటగాళ్లపై దాడి చేశాయి. ఒక్కసారిగా చుట్టుముట్టిన తేనెటీగల దాడిని తట్టుకోలేక వేటగాళ్లు ప్రాణాలు దక్కించుకుని పారిపోయారు.

నక్క మాత్రం మూర్ఖంగా తేనెటీగలపై తన బలం చూపించాలని ప్రయత్నించింది. కానీ తేనెటీగల సమూహదాడిని తట్టుకోలేక పరుగులు పెట్టింది. దూరం నుండి గమనించిన కోతి గుబురు పొదల్లోకి దూరిపో అని సలహా ఇచ్చింది. కోతి మాట విని నక్క తన ప్రాణాలను కాపాడుకుంది.

ఆ సమయంలో నక్కకు బుద్ధిబలం విలువ తెలిసింది. భుజబలం కంటే తెలివి గొప్పదని అర్థమైంది. తన పొరపాటు తెలుసుకుని పశ్చాత్తాపపడింది.

మరుసటి రోజు సింహం జంతువుల సమక్షంలో కోతిని అధికారికంగా గురువుగా ప్రకటించింది. చివరకు నక్క కూడా కోతిని అభినందించింది.

ఆ రోజు నుండి అడవిలో పిల్లలకు అసలైన చదువు ప్రారంభమైంది. బలమే కాదు బుద్ధియే నిజమైన శక్తి అని అందరూ గ్రహించారు.

How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

error: Content is protected !!