టాప్ ట్రెండింగ్ కథనాలు

శివునితో – పాలు చేసుకున్న విన్నపం

ఒకసారి పాలు పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది అని ఒక ఆధ్యాత్మిక కథ చెబుతుంది. తన అంతరంగ బాధను చెప్పుకోవాలనే ఆర్తితో అది ఈశ్వరుని ప్రార్థించింది. భక్తి పూర్వకమైన ఆ తపస్సుకు ప్రసన్నుడైన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి బాధ నీకు అని ప్రశ్నించాడు.

అప్పుడు పాలు వేదనతో ఇలా పలికింది. ఈశ్వరా, నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటాను. కానీ మానవుడు తన స్వప్రయోజనార్థం నాలో పులుపు కలిపి నా స్వరూపాన్ని మార్చేస్తున్నాడు. నా స్వచ్ఛతను విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని వేడుకుంది.

ఈశ్వరుడు స్వల్పంగా నవ్వి మృదువుగా సమాధానమిచ్చాడు. ఓ క్షీరమా, నీవు విను. నీవు పాలు లాగే ఉండాలని ఆశపడుతున్నావు. కానీ పాలు లాగా ఉంటే ఒక రోజే బ్రతుకుతావు. పాలకు పెరుగు తోడు కలిస్తే రెండు రోజులు నిలుస్తావు. పెరుగును చిలికి మజ్జిగ చేస్తే ఇంకొన్ని రోజులు నిలుస్తావు. ఆ మజ్జిగలోంచి వెన్నగా మారితే మరింత కాలం నిలుస్తావు. ఆ వెన్నను కాచి నెయ్యిగా మారితే నెలలు తరబడి నిలుస్తావు. అదే నెయ్యితో దీపం వెలిగిస్తే నీవు నాకు అర్పణవు అవుతావు.

ఇప్పుడు చెప్పు, ఒకరోజు పాలు లాగా ఉండి అలానే నశించిపోవాలనుకుంటావా లేక క్షణక్షణం రూపాంతరం చెంది మరింత విలువైనదై చివరికి నాకు అర్పణ కావాలనుకుంటావా అని ఈశ్వరుడు ప్రశ్నించాడు.

ఈ మాటలు విన్న పాలు నిశ్శబ్దమైంది. తన స్వరూపం మారడాన్ని శాపంగా భావించిన తాను, ఆ మార్పుల ద్వారానే ఉన్నత స్థితిని పొందగలమని గ్రహించింది. తన అజ్ఞానంపై సిగ్గుపడింది. ఈశ్వరునికి దాసోహమై రూపాంతరం స్వీకరించింది. చివరకు నెయ్యిగా మారి ఈశ్వరుని ముందు వెలిగే దీపంగా నిలిచింది.

ఈ కథ మనిషి జీవితానికి గొప్ప ఉపమానం. మన హృదయం ఎవరో విరిచేశారు అని బాధపడటం సులభం. కానీ ప్రతి పరిస్థితిని ఆధ్యాత్మిక తోడుగా స్వీకరిస్తే మనస్సు పెరుగుతుంది. ఈశ్వర నామస్మరణ అనే చిలుకుతో దాన్ని మథిస్తే అంతరంగం పరిశుద్ధమవుతుంది. దైవచింతన అనే అగ్నితో దాన్ని కాచితే జ్ఞానం ఉద్భవిస్తుంది. ఆ జ్ఞానం చివరకు మనల్ని దైవసాన్నిధ్యానికి తీసుకెళ్తుంది.

జీవితం ఒకరోజు పాలు లా ముగిసిపోవడానికి కాదు. క్రమంగా మారుతూ, పరిణామం చెందుతూ, లోపలి చీకటిని వెలుగుగా మార్చి దైవానికి అర్పణమయ్యే దీపంగా మారటమే జన్మ సార్థకత.

ఓం నమః శివాయ.

How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

error: Content is protected !!