గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ఈ శ్లోకం మనందరికీ తెలిసినదే. కానీ ఇది ఎలా పుట్టింది, మొదట ఎవరు పలికారు, దాని వెనుక ఉన్న ఆత్మీయ కథ ఏమిటి అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఈ శ్లోకం కేవలం పదాల సమాహారం కాదు. అది గురుభక్తి పరాకాష్ఠకు ప్రతీక.
పూర్వం కౌత్సుడు అనే పేద బాలుడు ఉండేవాడు. అతని విద్యాప్రేమను గమనించిన విద్యాధరుడు అనే మహాగురు అతనిని తన ఆశ్రమానికి తీసుకువచ్చి తనకు తెలిసిన సమస్త విద్యలను బోధించాడు. కౌత్సుడు వినయంతో, కృతజ్ఞతతో గురువును సేవిస్తూ చదువుకున్నాడు.
ఒకసారి గురువు కొన్ని రోజులపాటు బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆశ్రమం మొత్తం బాధ్యత కౌత్సుడిపైనే పడింది. అతడు ఎంతో జాగ్రత్తగా ఆశ్రమాన్ని చూసుకున్నాడు. గురువు తిరిగి వచ్చినప్పుడు ఆశ్రమం మరింత శుభ్రంగా, క్రమబద్ధంగా కనిపించింది.
కొన్ని రోజులకు కౌత్సుడి విద్యాభ్యాసం పూర్తయింది. అతన్ని తీసుకువెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు ఖరాఖండిగా చెప్పాడు తాను గురువును విడిచి వెళ్లనని. ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు వెనుదిరిగారు.
వాళ్లు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు. అప్పుడు కౌత్సుడు వినయంగా చెప్పాడు గురువుగారూ మీరు కొన్ని రోజుల క్రితం బయట ఉన్నప్పుడు మీ జాతకం చూశాను. సమీప భవిష్యత్తులో మీకు తీవ్రమైన రోగం వస్తుందని తెలిసింది. అలాంటి సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్లడం నాకు సాధ్యం కాదు.
కొన్ని రోజులకు గురువుకు క్షయ రోగం వచ్చింది. ఆ కాలంలో ఆ వ్యాధికి చికిత్స లేదు. పుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్లి దానధర్మాలు చేయాలని గురు శిష్యులు కలిసి బయలుదేరారు. అక్కడ గురువుని రోగస్థితి చూసి ప్రజలు దూరంగా ఉండసాగారు. కానీ కౌత్సుడు మాత్రం గురువును క్షణం కూడా వదలలేదు. ఎంతమంది వదిలి వెళ్లమని చెప్పినా అతను వినలేదు. సేవ, శ్రద్ధ, భక్తి మాత్రమే అతని ధర్మమయ్యాయి.
ఈ గురుభక్తిని చూసి త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వచ్చి గురువును వదిలేయమని చెప్పాడు. కౌత్సుడు వినలేదు. తరువాత విష్ణువు వచ్చి అదే సలహా ఇచ్చాడు. కౌత్సుడు వినలేదు. చివరకు పరమేశ్వరుడు వచ్చి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. అప్పుడు కౌత్సుడు ఒకటే కోరాడు. నా గురువును వదిలేయమని మరెవ్వరూ సలహా ఇవ్వకుండా కాపాడండి.
అతని నిష్ఠను చూసి త్రిమూర్తులు తమ నిజరూపంలో ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ప్రసాదిస్తామని చెప్పారు. అప్పుడు కౌత్సుడు వినయంతో ఇలా అన్నాడు నా గురువు లేకపోతే నాకు మీరు తెలిసేవారు కాదు. నా గురువే నాకు బ్రహ్మ. నా గురువే నాకు విష్ణువు. నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారమవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ.
అలా అతడు ఈ మహాశ్లోకాన్ని పలికాడు.
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
తన గురువుకే మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురుభక్తి పరాకాష్ఠను చూసి త్రిమూర్తులు గురువుకు మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లాడు.
ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. గురువు అనేది కేవలం బోధకుడు కాదు. ఆత్మజ్ఞానానికి మార్గదర్శి. మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించే దైవస్వరూపం. అందుకే గురువును త్రిమూర్తుల సమానంగా, పరబ్రహ్మస్వరూపంగా కీర్తించారు.
ఇలాంటి శ్లోకాల అర్థం తెలుసుకోవడం మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న ఆత్మీయతను, గురుభక్తిని మన జీవితంలో ఆచరించడం అవసరం. మనం తెలుసుకున్న విలువలను మన తరువాతి తరాలకు కూడా తెలియజేయడం మన బాధ్యత.
How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?


