టాప్ ట్రెండింగ్ కథనాలు

ధన్యవాదాలు పరమేశ్వరా…

ఒక ధనవంతుడు తన ఇంటి కిటికీ దగ్గర నిలబడి బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు. అతని దృష్టి వీధి చివర ఉన్న చెత్త కుండిపై పడింది. అందులోంచి ఒక నిరుపేద తన పొట్ట నింపుకోవడానికి ఏదో ఏరుకుంటూ ఉన్నాడు. ఆ దృశ్యం చూసి ధనవంతుడు లోలోపల ఇలా అన్నాడు భగవంతుడా నేను పేదవాడిని కానందుకు నీకు కృతజ్ఞతలు.

అదే సమయంలో ఆ నిరుపేద చుట్టూ చూసి రోడ్డుమధ్యలో నగ్నంగా తిరుగుతూ పిచ్చి చేష్టలు చేస్తున్న ఒక మనిషిని గమనించాడు. అతడు ఆలోచించాడు ఓ భగవంతుడా నేను పిచ్చివాడిని కానందుకు నీకు ఎంత కృతజ్ఞుడనో.

ఆ పిచ్చివాడు అలా ముందుకు నడుస్తూ ఉండగా ఒక అంబులెన్స్ వేగంగా దూసుకుపోయింది. అందులో ఒక రోగగ్రస్తుడిని తీసుకెళ్తున్నారు. ఆ దృశ్యం చూసి అతడు తనలోనే అన్నాడు భగవంతుడా నేను రోగిగా లేనందుకు నీకు కృతజ్ఞుడిని.

తరువాత ఆసుపత్రిలో ఒక రోగి ట్రాలీపై ఒక శవాన్ని మార్చురీ వైపు తీసుకెళ్తుండటం గమనించాడు. ఆ రోగి గుండెల్లో ఒక్కసారిగా చలనం కలిగింది. అతడు మృదువుగా అన్నాడు భగవంతుడా నేను ఇంకా బ్రతికే ఉన్నందుకు నీకు కృతజ్ఞుడిని.

ఈ ప్రపంచంలో ఒక్క చనిపోయిన వాడే భగవంతుడికి కృతజ్ఞత తెలియజేయలేడు. మిగిలిన ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం ఉంది.

ఈ జీవితం నీకు కానుకగా లభించింది. నిన్ను ఇంతవరకు కాపాడి నడిపిస్తున్న దైవ కృప నీతోనే ఉంది. మరి ఎందుకు మనం కృతజ్ఞతను మరచిపోతాం.

జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే మూడు ప్రదేశాలకు వెళ్లాలి అంటారు.

ఆసుపత్రి.

జైలు.

స్మశానవాటిక.

ఆసుపత్రిలో ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుస్తుంది. అక్కడ ప్రతి ఊపిరి విలువైనదని గ్రహిస్తాం.

జైలులో స్వేచ్ఛ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మనం సాధారణంగా తీసుకునే ప్రతి అడుగు ఒక వరమని తెలుసుకుంటాం.

స్మశానవాటికలో జీవితం ఎంత తాత్కాలికమో తెలుస్తుంది. ఈ రోజు మనం నడుస్తున్న ఈ నేలే రేపు మనపై మట్టిగా మారుతుందని గ్రహిస్తాం.

మనము ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోలేము. మధ్యలో ఉన్న ఈ కాలమే జీవితం. ఆ కాలాన్ని అహంకారంతో కాక అణుకువతో గడపాలి. వినయంతో జీవించాలి. ప్రతి శ్వాసను దైవానుగ్రహంగా భావించాలి.

ఎల్లప్పుడూ సర్వత్రా భగవంతునికి కృతజ్ఞతతో ఉండాలి.

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

లోకా సమస్తా సుఖినో భవంతు.

How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

error: Content is protected !!